పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
|
| 1 |
| అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను–యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా— రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.౹ |
| 2 |
| అందుకు ఎవరిచేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి–యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు— నీవు కన్నులార దానిని చూచెదవుగాని దానిని తినకుందు వని అతనితో చెప్పెను. |
| 3 |
| అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగు లుండగా వారు ఒకరినొకరు చూచి–మనము చచ్చిపోవువరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? |
| 4 |
| పట్టణములోనికి పోవుదమనుకొంటిమా పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము; ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము; పదండి, సిరియనులదండుపేట లోనికి, పోవుదము రండి, వారు మనలను బ్రదుకనిచ్చిన బ్రదుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని |
| 5 |
| సందెచీకటియందు సిరియనులదండు పేటలోనికి పోవలెనని లేచి, సిరియనులదండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడక పోయిరి.౹ |
| 6 |
| యెహోవా రథముల ధ్వనియు గుఱ్ఱముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనులదండునకు వినబడునట్లుచేయగా వారు–మనమీదికి వచ్చుటకై ఇశ్రాయేలురాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చియున్నాడని సిరియనులు ఒకరితో నొకరు చెప్పుకొని |
| 7 |
| లేచి తమ గుడారములలోనైనను గుఱ్ఱములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్నవాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని, సందె చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయియుండిరి.౹ |
| 8 |
| కాబట్టి ఆ కుష్ఠ రోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి యొక గుడారము జొచ్చి భోజనపానములుచేసి, అచ్చటనుండి వెండి బంగారములను బట్టలను ఎత్తికొనిపోయి దాచిపెట్టి, తిరిగి వచ్చి మరియొక గుడారము జొచ్చి అచ్చటనుండి సొమ్ము ఎత్తికొనిపోయి దాచిపెట్టిరి.౹ |
| 9 |
| వారు–మనము చేయునది మంచి పనికాదు, నేటిదినము శుభవర్తమానముగల దినము, మనము ఊరకొననేల? తెల్లవారువరకు మనము ఇచ్చటనుండినయెడల ఏదైన నొక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని |
| 10 |
| వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి–మేము సిరియనులదండుపేటకు పోతిమి. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైననులేదు. కట్టబడిన గుఱ్ఱములును కట్టబడిన గాడిదలును ఉన్నవిగాని గుడారముల దగ్గర ఎవరును లేరని వానితో అనగా |
| 11 |
| వాడు ద్వారపాల కుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటివారితో ఆ సమాచారము తెలియజెప్పగా |
| 12 |
| రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి–సిరియనులు మనకు చేసినదానిని నేను మీకు చూపింతును; మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనుక–వారు పట్టణములోనుండి బయటకు వచ్చినయెడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచనచేసి, పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను.౹ |
| 13 |
| అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవిచేసెను–ఇంతకుముందు ఇశ్రాయేలువారలలో బహు మంది మనుష్యులు లయమై పోయిరి గదా ఇక అయిదు గురు లయమై పోవుట అబ్బురమా? నీకు అనుకూలమైనయెడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో అయిదు గురిని తీసికొని పోనిమ్ము; మనము వారిని పంపి చూచెదమని చెప్పెను.౹ |
| 14 |
| వారు జోడు రథములను వాటి గుఱ్ఱములను తీసికొనగా–సిరియనుల సైన్యమువెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను.౹ |
| 15 |
| కాబట్టి వారు వారివెనుక యొర్దాను నదివరకు పోయి, సిరియనులు తొందరగా పోవుచు, పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి, ఆ దూతలు తిరిగివచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా |
| 16 |
| జనులు బయలుదేరి సిరియనులదండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాటచొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను.౹ |
| 17 |
| ఎవని చేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవ జనునియొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పినప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడుచేత అతడు మరణమాయెను.౹ |
| 18 |
| మరియు–రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్ననిపిండియు, రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను.౹ |
| 19 |
| ఆ యధిపతి–యెహోవా ఆకాశమందు కిటి కీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు–నీవు కన్నులార చూచెదవుగాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పెను.౹ |
| 20 |
| జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. |
|
| గమనికలను సేవ్ చేయండి |
https://beblia.bible:81/BibleAudio/telugu2016/2kings/007.mp3
25
7