×

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

ఎక్సోడస్ ౧౭

1
తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాటచొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లులేనందున
2
మోషేతో వాదిం చుచు–త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే— మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను.౹
3
అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పి గొని మోషేమీద సణుగుచు–ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులోనుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి.౹
4
అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచు–ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదు రనెను.౹
5
అందుకు యెహోవా–నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేతపట్టుకొని పొమ్ము
6
ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.౹
7
అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమునుబట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటనుబట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను.
8
తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా
9
మోషే యెహోషువతో–మనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను.౹
10
యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను; మోషే అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి
11
మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి,౹
12
మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతనిచేతులను ఆదుకొనగా అతనిచేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను.౹
13
అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.౹
14
అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను–నేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు విని పించుము.౹
15
తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరుపెట్టి
16
–అమాలేకీయులు తమచేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను.
Telugu Bible (TELOV) 2016
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible 2016 by The Bible Society of India Used by permission. worldwide
:
గమనికలను సేవ్ చేయండి