మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవును నీవు ఐగుప్తుదేశమునుండి తోడుకొనివచ్చిన ప్రజలును బయలుదేరి, నేను అబ్రాహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణముచేసి–నీ సంతానమునకు దీని నిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి.౹
కాగా యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఇశ్రాయేలీయులతో–మీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను.౹
అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి, దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్లుచు వచ్చెను.౹
మోషే ఆ గుడారమునకు వెళ్లినప్పుడు ప్రజలందరును లేచి, ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి, అతడు ఆ గుడారములోనికి పోవువరకు అతని వెనుకతట్టు నిదానించి చూచు చుండెను.౹
మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యౌవనస్థుడు గుడారములోనుండి వెలుపలికి రాలేదు.
మోషే యెహోవాతో ఇట్లనెను–చూడుము–ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావుగాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు–నేను నీ పేరునుబట్టి నిన్ను ఎరిగియున్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా.౹
కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగినయెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును; చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలేగదా అనెను.౹
నాయెడలను నీ ప్రజలయెడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును? నీవు మాతో వచ్చుటవలననే గదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమిమీదనున్న సమస్త ప్రజలలోనుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను.
ఆయన–నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరు ణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను.౹