పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
|
| 1 |
| అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమతమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా |
| 2 |
| యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి.౹ |
| 3 |
| అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను–ఇది యెహోవా చెప్పిన మాట–నాయొద్దనుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును;౹ |
| 4 |
| అహరోను మౌనముగానుండగా మోషే అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి–మీరు సమీపించి పరిశుద్ధ స్థలము నెదుటనుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసికొని పోవుడని వారితో చెప్పెను.౹ |
| 5 |
| మోషే చెప్పినట్లువారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసికొనిపోయిరి.౹ |
| 6 |
| అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో–మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజముమీద ఆగ్రహపడకుండునట్లును, మీరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు కాని, యెహోవావారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల యింటివారందరు ఏడవ వచ్చును.౹ |
| 7 |
| యెహోవా అభిషేకతైలము మీమీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనుండి బయలు వెళ్ల కూడ దనెను. వారు మోషే చెప్పిన మాటచొప్పున చేసిరి. |
| 8 |
| [8-9] మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను–మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చునప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు.౹ |
| 9 |
| 10 |
| మీరు ప్రతిష్ఠింపబడిన దానినుండి లౌకికమైనదానిని, అపవిత్రమైనదానినుండి పవిత్రమైనదానిని వేరుచేయుటకును,౹ |
| 11 |
| యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైనకట్టడ. |
| 12 |
| అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఇట్లనెను— మీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసికొని అది పొంగకుండ బలిపీఠము దగ్గర తినుడి; అది అతిపరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములోనుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడినవంతు.౹ |
| 13 |
| కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను; నేను అట్టి ఆజ్ఞను పొందితిని.౹ |
| 14 |
| మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు, అనగా నీవును నీతోపాటు నీ కుమారులును నీ కుమార్తెలును పవిత్రస్థలములో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు.౹ |
| 15 |
| హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించునట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసికొని రావలెను. నిత్యమైన కట్టడచొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. |
| 16 |
| అప్పుడు మోషే పాపపరిహారార్థబలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయి యుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారిమీద ఆగ్రహపడి |
| 17 |
| –మీరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థబలిపశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధముగదా. సమాజముయొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా.౹ |
| 18 |
| ఇదిగో దాని రక్తమును పరిశుద్ధస్థలములోనికి తేవలెను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధస్థలములో దానిని తినవలెనని చెప్పెను.౹ |
| 19 |
| అందుకు అహరోను మోషేతో–ఇదిగో నేడు పాప పరిహారార్థబలిపశువును దహనబలిద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాపపరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినినయెడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను.౹ |
| 20 |
| మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. |
|
| గమనికలను సేవ్ చేయండి |
https://beblia.bible:81/BibleAudio/telugu2016/leviticus/010.mp3
27
10