×

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

సంఖ్యలు ౨

1
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.౹
2
–ఇశ్రాయేలీయులందరు తమతమపితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమతమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను.౹
3
సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమతమ సేనలచొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.౹
4
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బదినాలుగువేల ఆరువందలమంది.౹
5
అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.౹
6
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది.౹
7
అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.౹
8
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగువందలమంది.౹
9
యూదా పాళెములో లెక్కింప బడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారువేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.
10
రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.౹
11
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది.౹
12
అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.౹
13
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడువందలమంది.౹
14
అతని సమీపమున గాదు గోత్రముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు కుమారులకు ప్రధానుడు.౹
15
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది.౹
16
రూబేను పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబదియొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవ తెగలో సాగినడవవలెను.
17
ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమతమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.
18
ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.౹
19
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది.౹
20
అతని సమీపమున మనేష్ష గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు.౹
21
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది.౹
22
అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.౹
23
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగువందలమంది.౹
24
ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.
25
దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషద్దాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు.౹
26
అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడువందలమంది.౹
27
అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.౹
28
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.౹
29
అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.౹
30
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందలమంది.౹
31
దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.
32
వీరు ఇశ్రాయేలీయులలో తమతమపితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు. తమతమ సేనల చొప్పున తమతమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.౹
33
అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.౹
34
అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లువారు తమతమ వంశములచొప్పునను తమతమపితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచునుండిరి.
Telugu Bible (TELOV) 2016
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible 2016 by The Bible Society of India Used by permission. worldwide
:
గమనికలను సేవ్ చేయండి