×

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

చట్టాలు ౩

1
పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా,౹
2
పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.౹
3
పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా౹
4
పేతురును యోహానును వానిని తేరి చూచి–మాతట్టు చూడుమనిరి.౹
5
వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.౹
6
అంతట పేతురు–వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి౹
7
వాని కుడిచెయ్యి పట్టుకొని లేవ నెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.౹
8
వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.౹
9
వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి౹
10
శృంగారమను దేవా లయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.
11
వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.౹
12
పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను–ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చి నట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు?౹
13
అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి.౹
14
మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగి తిరి.౹
15
మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.౹
16
ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను.౹
17
సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును.౹
18
అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను.౹
19
ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును౹
20
మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి.౹
21
అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము.౹
22
మోషే యిట్లనెను– ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ౹
23
ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.౹
24
మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.౹
25
ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో —నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీపితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు.౹
26
దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.
Telugu Bible (TELOV) 2016
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible 2016 by The Bible Society of India Used by permission. worldwide
:
గమనికలను సేవ్ చేయండి