వారు–ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ నుద్దేశించినయెడల ఊరకయే పంపక, యే విధముచేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థతనొంది ఆయన హస్తము మీ మీదనుండి యెందుకు తియ్యబడక యుండెనో మీరు తెలిసికొందు రనిరి.౹
ఫిలిష్తీయులు–మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా వారు— మీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక, ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను.౹
కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పంది కొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతలమీదను మీ భూమిమీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు.౹
ఐగుప్తీయులును ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుతకార్యములనుచేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి; ఇశ్రాయేలీయులు వెళ్లిపోయిరి గదా.౹
యెహోవా మందసమును ఆ బండిమీద ఎత్తి, అపరా ధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి.౹
అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటినయెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి.౹
ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా, వారు బండియొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి.౹
లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులుగల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతిమీద ఉంచగా, ఆ దినమున బేత్షెమెషువారు యెహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి.౹
అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదువారి నిమిత్తము ఒకటి, గాజావారి నిమిత్తము ఒకటి, అష్కెలోను వారి నిమిత్తము ఒకటి, గాతువారి నిమిత్తము ఒకటి, ఎక్రోనువారి నిమిత్తము ఒకటి.౹
ప్రాకారముగల పట్టణములవారేమి పొలములోని గ్రామములవారేమి ఫిలిష్తీయుల అయిదు గురు సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యము. నేటివరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములోనున్నది.౹
కిర్యత్యారీము కాపురస్థులకు దూతలను పంపి–ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరల తీసికొని వచ్చిరి; మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొని పోవలెనని వర్తమానము పంపిరి.