ఒక సంవత్సరం లో బైబిల్ అక్టోబర్ ౧౦యిర్మీయా ౫:౧-౩౧౧. యెరూషలేము వీధులలో ఇటు అటు పరుగెత్తుచు చూచి తెలిసికొనుడి; దాని రాజవీధులలో విచారణ చేయుడి; న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినయెడల నేను దాని క్షమించుదును.౹౨. యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు.౹౩. యెహోవా, యథార్థతమీదనే గదా నీవు దృిష్టి యుంచుచున్నావు? నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు; వారిని క్షీణింప జేసియున్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతికంటె తమ ముఖములను కఠినముగా చేసికొనియున్నారు, మళ్లుటకు సమ్మతింపరు.౹౪. నేనిట్లనుకొంటిని–వీరు ఎన్నికలేనివారై యుండి యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై యున్నారు.౹౫. ఘనులైనవారియొద్దకు పోయెదను వారితో మాటలాడెదను, వారు యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరిగినవారై యుందురుగదా అని నేననుకొంటిని. అయితే ఒకడును తప్పకుండ వారు కాడిని విరిచినవారుగాను కట్లను తెంపు కొనినవారుగాను ఉన్నారు.౹౬. వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచియుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.౹౭. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కానివాటి తోడని ప్రమాణము చేయుదురు; నేను వారిని తృప్తిగ పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు; నేనెట్లు నిన్ను క్షమించుదును?౮. బాగుగా బలిసిన గుఱ్ఱములవలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్యవెంబడి సకిలించును౯. అట్టి కార్యములనుబట్టి నేను దండింపకుందునా? అట్టి జనముమీద నాకోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు.౧౦. దాని ప్రాకారములెక్కి నాశనముచేయుడి, అయినను నిశ్శేషముగా నాశనముచేయకుడి, దాని శాఖలను కొట్టి వేయుడి. అవి యెహోవావి కావు.౹౧౧. ఇశ్రాయేలు వంశస్థులును యూదా వంశస్థులును బహుగా విశ్వాసఘాతకము చేసియున్నారు; ఇదే యెహోవా వాక్కు.౹౧౨. వారు— పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరవునైనను చూడ మనియు,౹౧౩. ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు.౹౧౪. కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.౹౧౫. ఇశ్రాయేలు కుటుంబమువారలారా, ఆలకించుడి, దూరముననుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను, అది బలమైన జనము పురాతనమైన జనము; దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకుమాటలు నీకు బోధపడవు.౹౧౬. వారి అమ్ముల పొది తెరచిన సమాధి, వారందరు బలాఢ్యులు,౹౧౭. వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు, నీ గొఱ్ఱెలను నీ పశువులను నాశనముచేయుదురు, నీ ద్రాక్షచెట్ల ఫలమును నీ అంజూరపుచెట్ల ఫలమును నాశనము చేయుదురు, నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములుగల పట్టణములను వారు కత్తిచేత పాడు చేయుదురు.౹౧౮. అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషములేకుండ నశింపజేయను; ఇదే యెహోవా వాక్కు.౹౧౯. –మన దేవుడైన యెహోవా దేనినిబట్టి ఇవన్నియు మాకు చేసెనని వారడుగగా నీవు వారితో ఈలాగనుము–మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచి నందుకు, మీదికాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౨౦. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి౨౧. –కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకములేని మూఢులారా, ఈ మాట వినుడి.౹౨౨. సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.౹౨౩. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమునుచేయు మనస్సుగల వారు, వారు తిరుగుబాటుచేయుచు తొలగి పోవుచున్నారు.౹౨౪. వారు–రండి మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించు వాడు గదా; నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు.౹౨౫. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.౹౨౬. నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి యుండునట్లువారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.౹౨౭. పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్య వంతులును అగుదురు.౹౨౮. వారు క్రొవ్వి బలిసియున్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు, తండ్రిలేనివారు గెలువకుండునట్లు వారి వ్యాజ్యెమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యెమును తీర్పునకు రానియ్యరు.౹౨౯. అట్టి వాటిని చూచి నేను శిక్షింపక యుందునా? అట్టి జనులకు నేను ప్రతి దండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.౩౦. ఘోరమైన భయంకరకార్యము దేశములో జరుగుచున్నది.౹౩౧. ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?యిర్మీయా ౬:౧-౩౦౧. బెన్యామీనీయులారా, యెరూషలేములోనుండి పారిపోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి, కీడు ఉత్తర దిక్కునుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది.౹౨. సుందరియు సుకుమారియునైన సీయోను కుమార్తెను పెల్ల గించుచున్నాను.౹౩. గొఱ్ఱెల కాపరులు తమ మందలతో ఆమెయొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టు తమ గుడారములను వేయుదురు, ప్రతివాడును తన కిష్టమైనచోట మందను మేపును.౹౪. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి; లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ, ప్రొద్దు గ్రుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి.౹౫. లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము.౹౬. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడిదిబ్బ కట్టుడి, ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడచునది గనుక శిక్ష నొందవలసి వచ్చెను.౹౭. ఊట తన జలమును పైకి ఉబుక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబుకచేయుచున్నది, బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది, గాయములును దెబ్బలును నిత్యము నాకు కనబడుచున్నవి.౹౮. యెరూషలేమా, నేను నీయొద్దనుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము.౯. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ద్రాక్షచెట్టు ఫలమును ఏరుకొనునట్లు మనుష్యులు ఏమియు మిగులకుండ ఇశ్రాయేలు శేషమును ఏరుదురు; ద్రాక్షపండ్లను ఏరువాడు చిన్న తీగెలను ఏరుటకై తన చెయ్యి మరల వేయునట్లు నీ చెయ్యివేయుము.౹౧౦. విందురని నేనెవరితో మాటలాడెదను? ఎవరికి సాక్ష్య మిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు.౹౧౧. కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణచుకొని అణచుకొని నేను విసికియున్నాను, ఒకడు తప్పకుండ వీధిలోనున్న పసిపిల్లలమీదను యౌవనుల గుంపుమీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను, భార్యా భర్తలును వయస్సుమీరినవారును వృద్ధులును పట్టుకొనబడెదరు.౹౧౨. ఏమియు మిగులకుండ వారి యిండ్లును వారి పొలములును వారి భార్యలును ఇతరులకు అప్పగింపబడుదురు, ఈ దేశనివాసులమీద నేను నా చెయ్యి చాపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు౧౩. –అల్పులేమి ఘనులేమి వారందరు మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు.౹౧౪. సమాధానములేని సమయమున–సమాధానము సమాధానమని చెప్పుచు, నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు.౹౧౫. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడి పోవువారితో వారు పడిపోవుదురు, నేను వారిని విమ ర్శించు కాలమునవారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౧౬. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు–మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు.౹౧౭. మిమ్మును కాపుకాయుటకు నేను కావలివారిని ఉంచియున్నాను; ఆలకించుడి, వారుచేయు బూరధ్వని వినబడుచున్నది.౹౧౮. అయితే మేము వినమని వారనుచున్నారు; అన్యజనులారా, వినుడి; సంఘమా, వారికి జరిగిన దానిని తెలిసికొనుము.౹౧౯. భూలోకమా, వినుము; ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను.౹౨౦. షేబనుండి వచ్చు సాంబ్రాణి నాకేల? దూరదేశమునుండి వచ్చు మధురమైన చెరుకు నాకేల? మీ దహనబలులు నాకిష్టమైనవి కావు, మీ బలులయందు నాకు సంతోషము లేదు.౹౨౧. కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్లు వేయుదును; తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు; ఇరుగుపొరుగువారును నశించెదరు.౨౨. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఉత్తర దేశమునుండి యొక జనము వచ్చుచున్నది, భూదిగంతములలోనుండి మహా జనము లేచి వచ్చుచున్నది.౹౨౩. వారు వింటిని ఈటెను వాడనేర్చినవారు, అది యొక క్రూర జనము; వారు జాలిలేనివారు, వారి స్వరము సముద్ర ఘోషవలె నున్నది, వారు గుఱ్ఱములెక్కి సవారిచేయు వారు; సీయోను కుమారీ, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధులవలె వ్యూహము తీరియున్నారు.౹౨౪. దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి, ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము.౹౨౫. పొలములోనికి పోకుము, మార్గములో నడువకుము, శత్రువులు కత్తిని ఝుళిపించుచున్నారు, నలు దిక్కుల భయము తగులుచున్నది.౹౨౬. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మామీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిదె చల్లుకొనుము; ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము.౹౨౭. నీవు నా జనుల మార్గమును తెలిసి కొని పరీక్షించునట్లు నిన్ను వారికి వన్నెచూచువానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించియున్నాను.౹౨౮. వారందరు బహు ద్రోహులు, కొండె గాండ్రు, వారు మట్టిలోహము వంటివారు, వారందరు చెరుపువారు.౹౨౯. కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది; వ్యర్థము గానే చొక్కముచేయుచు వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు.౹౩౦. యెహోవావారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండియని వారికి పేరు పెట్టబడును.కీర్తనలు ౧౧౭:౧-౨౧. యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును.౨. కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి.సామెతలు ౨౭:౩-౪౩. రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.౪. క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?కొలస్సీయులకు ౧:౧-౨౯౧. కొలొస్సయిలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తు నందు విశ్వాసులైన సహోదరులకు,౹౨. దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమనిచెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక.౩. [౩-౪] పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమనుగూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.౹౪. ౫. మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.౹౬. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించు చున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది.౹౭. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసునివలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి.౹౮. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు; అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు.౯. [౯-౧౨] అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము.౹౧౦. ౧౧. ౧౨. ౧౩. ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.౹౧౪. ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది.౹౧౫. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.౹౧౬. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.౹౧౭. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.౹౧౮. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.౹౧౯. [౧౯-౨౦] ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.౹౨౦. ౨౧. మరియు గతకాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్క్రియలవలన మీ మనస్సులో విరోధభావముగలవారునైయుండిన మిమ్మును కూడ౹౨౨. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.౹౨౩. పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి యుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.౨౪. ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్నశ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.౹౨౫. [౨౫-౨౬] దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచార కుడనైతిని.౹౨౬. ౨౭. అన్యజనులలో ఈ మర్మముయొక్క మిహ మైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీయందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను.౹౨౮. ప్రతిమనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతిమనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతిమనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.౹౨౯. అందునిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. Telugu Bible (TELOV) 2016 Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. worldwide