ఒక సంవత్సరం లో బైబిల్ జూలై ౧౩చట్టాలు ౧౭:౧౬-౩౪౧౬. పౌలు ఏతెన్సులో వారి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ పట్టణం నిండా ఉన్న విగ్రహాలను గమనించి అతని ఆత్మ పరితపించింది.౧౭. అందుచేత సమాజ మందిరంలో యూదులతోనూ దేవుణ్ణి ఆరాధించే వారితోనూ, అంగడి వీధుల్లో ప్రతి రోజూ వచ్చిపోయే వారితోనూ చర్చిస్తూ వచ్చాడు.౧౮. ఎపికూరీయుల స్తోయికుల వర్గానికి చెందిన కొంతమంది తత్వవేత్తలు అతనితో వాదించారు. కొంతమంది, “ఈ వాగుడుకాయ చెప్పేది ఏమిటి” అని చెప్పుకున్నారు. అతడు యేసుని గూర్చీ, చనిపోయిన వారు తిరిగి బ్రతకడం గూర్చీ ప్రకటించాడు కాబట్టి మరి కొంత మంది, “ఇతడు మనం ఎరగని దేవుళ్ళను ప్రచారం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.౧౯. వారు అతనిని వెంటబెట్టుకొని అరియోపగు అనే సమాఖ్య దగ్గరికి తీసుకుపోయి, “నీవు చెబుతున్న ఈ కొత్త బోధ మేము తెలుసుకోవచ్చా?౨౦. నీవు కొన్ని వింత విషయాలు మాకు వినిపిస్తున్నావు. అందుచేత వీటి అర్థమేంటో మాకు తెలుసుకోవాలని ఉంది” అని చెప్పారు.౨౧. ఏతెన్సు వారూ, అక్కడ నివసించే విదేశీయులూ ఏదో ఒక కొత్త విషయం చెప్పడంలో, వినడంలో మాత్రమే తమ సమయాన్ని గడిపేవారు.౨౨. పౌలు అరియోపగు సభనుద్దేశించి, “ఏతెన్సు వాసులారా, మీరు అన్ని విషయాల్లో చాలా భక్తిపరులని నేను గమనిస్తున్నాను.౨౩. నేను దారిన పోతుంటే మీరు పూజించే వాటిని చూశాను. అక్కడ ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద “తెలియని దేవునికి” అని రాసి ఉంది. కాబట్టి మీరు తెలియకుండా దేనిని ఆరాధిస్తున్నారో దానినే నేను మీకు తెలియజేస్తున్నాను.౨౪. విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతితో చేసిన ఆలయాల్లో నివసించడు.౨౫. ఆయన అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.౨౬. ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు.౨౭. అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు.౨౮. మనం ఆయనలో బతుకుతున్నాం, ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి. ‘మనమాయన సంతానం,’ అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.౨౯. కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.౩౦. ఆ ఆజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మానవులందరూ అంతటా పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు.౩౧. ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు.”౩౨. మృతులు చనిపోయి తిరిగి లేవడం గురించి వారు విన్నప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. మరి కొంతమంది దీన్ని గురించి నీవు చెప్పేది మరొకసారి వింటామని చెప్పారు.౩౩. ఆ తరువాత పౌలు వారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు.౩౪. అయితే కొంతమంది అతనితో చేరి విశ్వసించారు. వారిలో అరియోపగీతు వాడైన దియొనూసియ, దమరి అనే ఒక స్త్రీ, వీరితోబాటు మరి కొంతమంది కూడా ఉన్నారు. Telugu Bible (IRV) 2019 Creative Commons License Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు)