[౧౪] మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. [౧౫] మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. [౧౬] మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
[౧] మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. [౨] మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. [౩] నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? [౪] నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి–నీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? [౫] వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
[౧౬] మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను. [౧౭] ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను.
[౨౪] పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి. [౨౫] ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెనుతనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు. [౨౬] సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును? [౨౭] నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టు చున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులైయుందురు. [౨౮] దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. [౨౯] ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును. [౩౦] నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు.
[౧] ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. [౨] బహుజనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా [౩] ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా — ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. [౪] వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మ్రింగివేసెను [౫] కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని [౬] సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. [౭] కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను. [౮] కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను. [౯] చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. [౧౦] తరువాత శిష్యులు వచ్చి–నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను [౧౧] –పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. [౧౨] కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. మరియు–వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. [౧౩] [13-15] ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందము లైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహిం పనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెర వేరుచున్నది. [౧౪] అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. [౧౫] అనేక ప్రవక్తలును నీతిమంతు లును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. [౧౬] [18-19] విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. [౧౭] రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు. [౧౮] అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును. [౧౯] ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. [౨౦] మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను. [౨౧] ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనమువిత్తిన యొక మనుష్యుని పోలియున్నది. [౨౨] మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమలమధ్యను గురుగులు విత్తిపోయెను. [౨౩] మొలకలు పెరిగి గింజపెట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను.
[౨౪] అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి —అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమువిత్తితివి గదా, అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి. [౨౫] –ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు–మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. [౨౬] అందుకతడు —వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. [౨౭] కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను. [౨౮] ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను–పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. [౨౯] అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును. [౩౦] ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను–పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.
[౩౧] నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను [౩౨] అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.
[౩౩] అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి–పొలము లోని గురుగులనుగూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి. [౩౪] అందుకాయన ఇట్లనెను–మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు;
మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పెట్టిన వలను పోలియున్నది.
[౪౫] అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. [౪౬] ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి,
[౪౭] వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును. [౪౮] వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితి మనిరి. [౪౯] ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను. [౫౦] యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి, సమాజమందిరములలో వారికి బోధించుచుండెను.
[౧౦] అంతట ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా [౧౧] ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. [౧౨] వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. [౧౩] అందుకు పేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా [౧౪] ఆయన మీరును ఇంతవరకు అవివేకులైయున్నారా? [౧౫] నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని [౧౬] నోటనుండి బయటికి వచ్చునవి హృదయములోనుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? [౧౭] దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములోనుండియే వచ్చును [౧౮] ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. [౧౯] [21-22] యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపెట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను. [౨౦] అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి–ఈమె మన వెంబడి వచ్చి కేకలువేయు చున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడు కొనగా
[౧౦] ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. [౧౧] [11-12] మీకేమి తోచును? ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల తొంబదితొమ్మిదింటిని కొండలమీద విడిచివెళ్లి తప్పిపోయినదానిని వెదకడా? [౧౨] వాడు దాని కనుగొనినయెడల తొంబదితొమ్మిది గొఱ్ఱెలనుగూర్చి సంతోషించు నంతకంటె దానినిగూర్చి యెక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. [౧౩] ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు. [౧౪] మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసినయెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.
[౨౩] అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను. [౨౪] అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. [౨౫] కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కి–నాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా [౨౬] ఆ దాసుని యజమానుడు కనికర పడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను. [౨౭] అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొని–నీవు అచ్చియున్నది చెల్లింపు మనెను [౨౮] అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి–నా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని [౨౯] వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను. [౩౦] కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. [౩౧] అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి —చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని; [౩౨] నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను. [౩౩] అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించువరకు బాధపరచువారికి వాని నప్పగించెను. [౩౪] మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆప్రకారమే మీయెడల చేయుననెను. [౩౫] యేసు ఈ మాటలుచెప్పి చాలించిన తరువాత. గలిలయనుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను.
[౧] ఏలాగనగా–పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి [౨] దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను. [౩] తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి [౪] –మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి. [౫] దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను. [౬] తిరిగి దాదాపు అయిదు గంట లకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా [౭] వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను. [౮] సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి–పనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. [౯] దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి. [౧౦] మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను. [౧౧] [11-12] వారది తీసికొని — చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజమానునిమీద సణుగుకొనిరి. [౧౨] అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము; [౧౩] నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది; [౧౪] నాకిష్టమువచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను. [౧౫] ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. [౧౬] యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను.
[౨౮] మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చి కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా [౨౯] వాడు పోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. [౩౦] అతడు రెండవవానియొద్దకు వచ్చి ఆప్రకారమే చెప్పగా వాడు అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడని వారి నడిగెను. [౩౧] అందుకు వారు–మొదటివాడే అనిరి. యేసు సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. [౩౨] యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్య లును అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడక పోతిరి.
[౩౩] మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమాను డొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలి పించి, గోపురముకట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను. [౩౪] పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా [౩౫] ఆ కాపులు అతని దాసు లను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరి యొకనిమీద రాళ్లు రువ్విరి. [౩౬] మరల అతడుమునుపటి కంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆప్రకారమే చేసిరి. [౩౭] తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. [౩౮] అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వార సుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము చెప్పుకొని [౩౯] అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి. [౪౦] కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను. [౪౧] అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతరకాపులకు ఆ ద్రాక్షతోట గుత్త కిచ్చునని ఆయనతో చెప్పిరి. [౪౨] మరియు యేసు వారిని చూచి –ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా? [౪౩] కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. [౪౪] మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను. [౪౫] ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మునుగూర్చియే చెప్పెనని గ్రహించి
[౧] యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. [౨] పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది. [౩] ఆ పెండ్లి విందుకు పిలువబడినవారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. [౪] కాగా అతడు–ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దు లును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని [౫] వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి. [౬] తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. [౭] కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను. [౮] అప్పుడతడు–పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు. [౯] గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. [౧౦] ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డ వారినేమి మంచివారినేమి తమకు కనబడినవారినందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లి శాల నిండెను. [౧౧] రాజు కూర్చున్నవారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి [౧౨] –స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియైయుండెను. [౧౩] అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. [౧౪] కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.
[౩౨] అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చు కొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. [౩౩] ఆప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచు నప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. [౩౪] ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. [౩౫] ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.
[౪౫] యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు డెవడు? [౪౬] యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. [౪౭] అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. [౪౮] అయితే దుష్టు డైన యొక దాసుడు–నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని [౪౯] తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె [౫౦] ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతోకూడ వానికి పాలు నియమించును. [౫౧] అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.
[౧] పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్య కలను పోలియున్నది. [౨] వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు. [౩] బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు. [౪] బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి. [౫] పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. [౬] అర్ధరాత్రివేళ— ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. [౭] అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని [౮] బుద్ధిలేని ఆ కన్యకలు— మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి. [౯] అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. [౧౦] వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితోకూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి; [౧౧] అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి–అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా [౧౨] అతడు–మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. [౧౩] ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
[౧౪] (పరలోకరాజ్యము) ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించినట్లుండును. [౧౫] అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను. [౧౬] అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపా దించెను. [౧౭] ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను. [౧౮] అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. [౧౯] బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను. [౨౦] అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చి అయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించితివే; అవియుగాక మరి యయిదు తలాంతులు సంపా దించితినని చెప్పెను. [౨౧] అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. [౨౨] ఆలాగే రెండు తలాంతులు తీసికొనినవాడు వచ్చి అయ్యా, నీవు నాకు రెండు తలాంతులప్పగించితివే అవియుగాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను. [౨౩] అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను. [౨౪] తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి — అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును [౨౫] గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను. [౨౬] అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? [౨౭] అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితోకూడ నా సొమ్ము తీసికొనియుందునే అని చెప్పి [౨౮] –ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి. [౨౯] కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసి వేయబడును. [౩౦] మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.
Telugu Bible (TELOV) 2016
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible 2016 by The Bible Society of India Used by permission. worldwide